20, మార్చి 2013, బుధవారం

యాంటి బయాటిక్ రెసిస్టన్స్-వైద్య శాస్త్రానికి పెను సవాల్?

అంటు వ్యాధులు , సూక్ష్మ జీవుల వలన కలిగే పుండ్లు,గొంతు నొప్పి,దంత సమస్యలు,విరోచనాలు వంటి ఆరోగ్య సమస్యలను నయం చెయ్యడానికి యాంటిబయాటిక్స్ ని వాడమని వైద్యులు సలహా ఇవ్వడం ఈ రోజుల్లో సర్వ సాధారణం.వైద్యుల సలహా లేకుండా కొందరు ఓవర్ ది కౌంటర్ (over the counter) యాంటిబయాటిక్స్ ని తరచు గా వాడుతుంటారు.కొన్నేళ్ళ క్రిందటి వరకు నాకు కూడా ఇలా అవసరమైనప్పుడు యాంటిబయాటిక్స్ తో సొంత వైద్యం చేసుకోవడం అలవాటుగా ఉండేది. అమోక్సీసిల్లిన్, ఎరిత్రోమైసిన్,సిప్రొఫ్లొక్షసిన్  లాంటి యాంటి బయాటిక్స్ ను అవసరానికి మించి , వైద్యుల సలహా లేకుండా వాడడం వలన జరిగే హాని గురించి వైద్య శాస్త్రజ్ఞులకు ఒక అవగాహన ఉంది.
 యాంటి బయాటిక్స్  శరీరం లో ని రోగ కారక క్రిములపై విష ప్రభావం చూపి వాటిని మనశారీరం లో నుంచి పూర్తిగా నిర్మూలించి మనకు మేలు చేస్తాయి.కానీ వైద్యులు సూచించిన మోతాదులో , వారు నిర్దేశించిన కాలం పాటు యాంటి బయాటిక్స్ వాడకం జరగక పోతే రోగ కారక సూక్ష్మ జీవులు (ఉదాహరణకు బాక్టీరియా) ఆయా యాంటి బయాటిక్స్ ను నిర్వీర్యం చేసే జన్యువులు, ఎంజైముల వ్యవస్థను పెంపొందింప చేసుకునే ప్రమాదం ఉంది. దీనినే యాంటి బయాటిక్ రెసిస్టన్స్ గా పేర్కొంటారు.ఇలా అంటి బయాటిక్ రెసిస్టన్స్ జన్యువులను కలిగిన సూక్ష్మ జీవుల పై సాధారణం గా వైద్యులు సూచించే యాంటి బయాటిక్స్ ఏ విధమైన ప్రభావం చూప లేవు.ఇటువంటి  యాంటి బయాటిక్ రేసిస్టంట్ రోగకారక క్రిముల నిర్మూలనానికి మరింత శక్తివంతమైన విషతుల్యమైన యాంటి బయాటిక్స్ ని మన శరీరం లో కి పంపించ వలసి ఉంటుంది. దీని వలన రోగి శరీరం లో ఇతర దుష్పరిమాణాలు కలిగే ప్రమాదం ఉంది.ఒక రకమైన యాంటి బయాటిక్స్  పై నిరోధక శక్తి ని సూక్ష్మజీవులపై మొదటి  యాంటి బయాటిక్స్కంటే ఎక్కువ ప్రభావ వంతమైన ఎండ్ అఫ్ ది లైన్ యాంటి బయాటిక్స్ ని వాడ వలసి ఉంటుంది.ఎండ్ అఫ్ ది లైన్ యాంటి బయాటిక్స్ అంటే ఆ మందుల ను  ఆఖరి  ఆయుధం గా వాడుతున్నాం అన్న మాట.వాటి తరువాత రోగ చికిత్సకు ఉన్న మార్గాలన్నీ మూసుకు పోతాయి.తరువాత ఫార్మా రంగం లో మరింత ప్రభావవంతమైన శక్తివంతమైన మందుల పై పరిశోధనలు జరిగి కొత్త యాన్తిబయాతిక్స్ ను ఉత్పత్తి చేయాల్సిన అవసరం కలుగుతుంది.
గత వారం ఈనాడు పేపర్లో మరియు ఇండియా టుడే వార పత్రిక లో యాంటి బయాటిక్ రెసిస్టన్స్ పై సమగ్రమైన వ్యాసాలు ప్రచురించారు.యాంటి బయాటిక్స్ వాడకం మొదలైన తరువాత  వీటి వాడకం ద్వారా చాలా వరకు  అంటువ్యాధులను నిర్మూలించడం జరిగింది.రెండవ ప్రపంచ యుద్ధ కాలం వరకు శాస్త్ర చికిత్సల తరువాత వచ్చే ఇన్ఫెక్షన్స్(పోస్ట్ సర్జికల్ ఇఫెక్షన్స్) వలన , ప్రసవం తరువాత (పోస్ట్ పార్తం) ఇన్ఫెక్షన్స్ వలన చాలా మంది చని పోతుండే వారు.యుద్ధంలో గాయ పడిన సైనికులకు చికిత్స చేసే సమయం లో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణం గా శస్త్రచికిత్స ద్వారా అవయవాలను తొలగించి ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములు శరీరం మొత్తం వ్యాపించ కుండా ప్రాణ హాని ని తగ్గించే వారు.కానీ అప్పట్లో సూక్ష్మ జీవులతో పోరాడటానికి సరైన మందులు వైద్య శాస్త్రానికి అందుబాటులో లేకపోవడంతో శస్త్ర చికిత్సలు విజయవంతమైనప్పటికీ సూక్ష్మజీవుల ద్వారా కలిగే ఇన్ఫెక్షన్స్ ప్రాణాంతకం గా పరిణమించేవి.

౧౯౨౯ లో అలేక్జాన్దర్ ఫ్లెమింగ్ అనే ఆంగ్ల శాస్త్ర వేత్త అనుకోకుండా పెనిసిల్లియం అనే ఒక రకమైన శిలీన్ద్రం స్తఫిలోకోకస్ అనే బాక్టీరియా పెరుగుదలను అడుపుచేయగల పెనిసిలిన్ అనే ఔషధాన్ని ఉత్పత్తి చేయడం గమనించాడు.ఈ ఔషధాన్ని శుద్ధి చేసి చికిత్స కోసం తయారు చెయ్యడానికి హోవార్డ్ ఫ్లోరీ మరియు ఎర్నెస్ట్ చైన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలకు దశాబ్దం పైగా సమయం పట్టింది.౧౯౪౨ లో మొట్టమొదటి సారిగా వీరు ఇరువురూ తయారు చేసిన పెనిసిల్లిన్ యాంటి బయాటిక్ ని ఒక గాయ పడిన వ్యక్తి కి అందించి బాక్తీరియల్ ఇన్ఫెక్షన్ ను అదుపు చేయ గలిగారు.కానీ సరైన మోతాదు లో శుద్ధి చేయబడిన పెనిసిల్లిన్ లభ్యం కాలేక పోవడం తో ఆ రోగి మృతి చెందాడు.ఆ తరువాత పెనిసిల్లిన్ విరివిగా వాడుక లో కి వచ్చింది.పలు రకాల ఇతర యాన్తిబయాతిక్స్ ను కూడా శాస్త్రజ్ఞులు త్వరిత గతిన కనుగొని మరిన్ని వ్యాధులను అంతం చేసే మార్గం సుగమం చేశారు.అలేక్జాన్దర్ ఫ్లెమింగ్,ఫ్లోరీ,చైన్ లు నోబెల్ ప్రైజు కూడా గెలుచుకున్నారు.తన నోబెల్ ప్రైజు స్వీకార ప్రసంగంలో నే అలేక్జాన్దర్ ఫ్లెమింగ్ యాంటి బయాటిక్ రేసిస్తంట్ క్రిముల పరిణామ ప్రక్రియ గురించి హెచ్చరించడం విశేషం.
    మితి మీరిన యాంటి బయాటిక్ ల వాడకం వలన భారత దేశంలో చాలా రకాల సాధారణ యాన్తిబయాతిక్స్ కు లొంగని క్రిములు ప్రబలి ప్రపంచ వ్యాప్తం గా వ్యాపిస్తున్నట్లు ది లాన్సెట్ మెడికల్ జర్నల్ లో మూడేళ్ళ క్రితం ప్రచురింప బడిన ఒక పరిశోధనాత్మక వ్యాసం పేర్కొంది.మన దేశం లో " న్యూ ఢిల్లీ మేటల్లో బీటా లాక్టమేజ్" అనే ఎంజైమ్ ను ఉత్పత్తి చేయడం ద్వారా యాన్తిబయాతటిక్ లను నిర్వీర్యం చేసే బాక్టీరియాలు, సంబంధిత జన్యువులు అతివేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ఇటువంటి వార్త ల ద్వారా తెలుస్తోంది.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మితి మీరిన యాన్తిబయాతిక్ ల వినియోగానికి అడ్డుకట్ట వెయ్యక పోతే చాలా మంది ప్రజలు యాంటి బయాటిక్ రెసిస్టన్స్  జన్యువులు కలిగిన క్రిముల ద్వారా వ్యాపించే  ఆరోగ్య సమస్యల కు ప్రాణాలు బలిచేయాల్సి వస్తుంది.అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలాలో యాంటి బయాటిక్స్ వాడకాన్ని ప్రభుత్వం అతి సమర్థ వంతం గా నియంత్రించి దేశ ఆరోగ్య భద్రతను కాపాడుతున్నట్లు ఇండియా టుడే పత్రిక తన మర్చి ౮ కథనం లో పేర్కొంది.