25, ఆగస్టు 2013, ఆదివారం

స్పాన్టేనియస్ హ్యూమన్ కంబషన్

కొద్ది సేపటి క్రితం యాహూ మెయిల్ చెక్ చేద్దామని యాహూ వెబ్ సైట్ ని సందర్శించినప్పుడు ఒక వీడియో నన్ను ఆకర్షించింది. ఇటీవలి కాలంలో సమాచార మాధ్యమాలలో ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక స్పాన్టేనియస్  హ్యూమన్ కంబషన్ ఘటన గురించి వివరించే వీడియో అది.స్పాన్టేనియస్ హ్యూమన్ కంబషన్ ఘటన తమిళ నాడు రాష్ట్రం లో ని విల్లుపురం ప్రాంతం లో జరిగింది. స్పాన్టేనియస్  హ్యూమన్ కంబషన్ అంటె మానవ శరీరం తనంతట అదే దహించుకు పోవడం అన్న మాట. నేచర్ వరల్డ్ న్యూస్  అంతర్జాల ప్రచురణ  రాహుల్ అనే విల్లుపురం ప్రాంతానికి చెందిన మూణ్నేల్ల పసివాడు ఈ విధంగా స్పాన్టేనియస్  హ్యూమన్ కంబషన్ ద్వారా తీవ్ర గాయాల పాలైనట్లు కథనం ప్రచురించింది.పలు జాతీయ అంతర్జాతీయ వార్తా పత్రికలలో కూడా ఈ ఘటన ప్రస్తావిన్చాయి.
     కాలిన్ విల్సన్ వ్రాసిన అక్కల్ట్  అనే పుస్తకంలో కూడా ఈ విషయ ప్రస్తావన ఉంది. ప్రస్తుత టపా మొదటి పేరా లో ప్రస్తావించిన వీడియో ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఇంతవరకు రెండు వందల సంఘటనలు జరిగినట్టుగా చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది. స్పాన్టేనియస్  హ్యూమన్ కంబషన్ ను ఆంగ్ల భాషలో ఎస్.హెచ్.సి అని కురుచగా పిలుస్తున్నారు.
       విజ్ఞాన శాస్త్ర ప్రస్తుత పరిజ్ఞానం తో ఎస్.హెచ్.సి గురించి పూర్తిగా హేతుబద్ధ మైన వివరణ ఇవ్వడానికి సరిపడే పరిశోధనలు జరగలేదు. కానీ జో నికెల్ అనే వైజ్ఞానికుడు మరియు జాన్ ఎఫ్ ఫిషేర్ అనే ఫోరెన్సిక్ నిపుణుడు 1984 లో ఈ విషయం పై రెండేళ్ళ పాటు విస్తృత పరిశోధనలు చేసి తమ పరిశోధనలో తేలిన విషయాలను అక్షరబద్ధం చేసినట్టు వికి పెడియా వ్యాసం ద్వారా తెలుస్తోంది.
    ఈ విషయం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకునే చదువరులు హౌ స్టఫ్ వర్క్స్ వెబ్ సైట్ లో టేల్స్ అఫ్  స్పాన్టేనియస్   కంబషన్  అనే వ్యాసం చదవగలరు. అంతే కాకుండా , ది శాడో ల్యాండ్ అనే వెబ్సైటు లో ఎస్.హెచ్.సి చాయా చిత్రాలు కూడా చూడవచ్చు. ఈ ఎస్.హెచ్.సి ఘటనల పై విజ్ఞాన శాస్త్రం భవిష్యత్తు లో ఎలాంటి స్పష్టత ఇస్తుందో భవిష్యత్తులో తెలుసుకుందాం.

20, మార్చి 2013, బుధవారం

యాంటి బయాటిక్ రెసిస్టన్స్-వైద్య శాస్త్రానికి పెను సవాల్?

అంటు వ్యాధులు , సూక్ష్మ జీవుల వలన కలిగే పుండ్లు,గొంతు నొప్పి,దంత సమస్యలు,విరోచనాలు వంటి ఆరోగ్య సమస్యలను నయం చెయ్యడానికి యాంటిబయాటిక్స్ ని వాడమని వైద్యులు సలహా ఇవ్వడం ఈ రోజుల్లో సర్వ సాధారణం.వైద్యుల సలహా లేకుండా కొందరు ఓవర్ ది కౌంటర్ (over the counter) యాంటిబయాటిక్స్ ని తరచు గా వాడుతుంటారు.కొన్నేళ్ళ క్రిందటి వరకు నాకు కూడా ఇలా అవసరమైనప్పుడు యాంటిబయాటిక్స్ తో సొంత వైద్యం చేసుకోవడం అలవాటుగా ఉండేది. అమోక్సీసిల్లిన్, ఎరిత్రోమైసిన్,సిప్రొఫ్లొక్షసిన్  లాంటి యాంటి బయాటిక్స్ ను అవసరానికి మించి , వైద్యుల సలహా లేకుండా వాడడం వలన జరిగే హాని గురించి వైద్య శాస్త్రజ్ఞులకు ఒక అవగాహన ఉంది.
 యాంటి బయాటిక్స్  శరీరం లో ని రోగ కారక క్రిములపై విష ప్రభావం చూపి వాటిని మనశారీరం లో నుంచి పూర్తిగా నిర్మూలించి మనకు మేలు చేస్తాయి.కానీ వైద్యులు సూచించిన మోతాదులో , వారు నిర్దేశించిన కాలం పాటు యాంటి బయాటిక్స్ వాడకం జరగక పోతే రోగ కారక సూక్ష్మ జీవులు (ఉదాహరణకు బాక్టీరియా) ఆయా యాంటి బయాటిక్స్ ను నిర్వీర్యం చేసే జన్యువులు, ఎంజైముల వ్యవస్థను పెంపొందింప చేసుకునే ప్రమాదం ఉంది. దీనినే యాంటి బయాటిక్ రెసిస్టన్స్ గా పేర్కొంటారు.ఇలా అంటి బయాటిక్ రెసిస్టన్స్ జన్యువులను కలిగిన సూక్ష్మ జీవుల పై సాధారణం గా వైద్యులు సూచించే యాంటి బయాటిక్స్ ఏ విధమైన ప్రభావం చూప లేవు.ఇటువంటి  యాంటి బయాటిక్ రేసిస్టంట్ రోగకారక క్రిముల నిర్మూలనానికి మరింత శక్తివంతమైన విషతుల్యమైన యాంటి బయాటిక్స్ ని మన శరీరం లో కి పంపించ వలసి ఉంటుంది. దీని వలన రోగి శరీరం లో ఇతర దుష్పరిమాణాలు కలిగే ప్రమాదం ఉంది.ఒక రకమైన యాంటి బయాటిక్స్  పై నిరోధక శక్తి ని సూక్ష్మజీవులపై మొదటి  యాంటి బయాటిక్స్కంటే ఎక్కువ ప్రభావ వంతమైన ఎండ్ అఫ్ ది లైన్ యాంటి బయాటిక్స్ ని వాడ వలసి ఉంటుంది.ఎండ్ అఫ్ ది లైన్ యాంటి బయాటిక్స్ అంటే ఆ మందుల ను  ఆఖరి  ఆయుధం గా వాడుతున్నాం అన్న మాట.వాటి తరువాత రోగ చికిత్సకు ఉన్న మార్గాలన్నీ మూసుకు పోతాయి.తరువాత ఫార్మా రంగం లో మరింత ప్రభావవంతమైన శక్తివంతమైన మందుల పై పరిశోధనలు జరిగి కొత్త యాన్తిబయాతిక్స్ ను ఉత్పత్తి చేయాల్సిన అవసరం కలుగుతుంది.
గత వారం ఈనాడు పేపర్లో మరియు ఇండియా టుడే వార పత్రిక లో యాంటి బయాటిక్ రెసిస్టన్స్ పై సమగ్రమైన వ్యాసాలు ప్రచురించారు.యాంటి బయాటిక్స్ వాడకం మొదలైన తరువాత  వీటి వాడకం ద్వారా చాలా వరకు  అంటువ్యాధులను నిర్మూలించడం జరిగింది.రెండవ ప్రపంచ యుద్ధ కాలం వరకు శాస్త్ర చికిత్సల తరువాత వచ్చే ఇన్ఫెక్షన్స్(పోస్ట్ సర్జికల్ ఇఫెక్షన్స్) వలన , ప్రసవం తరువాత (పోస్ట్ పార్తం) ఇన్ఫెక్షన్స్ వలన చాలా మంది చని పోతుండే వారు.యుద్ధంలో గాయ పడిన సైనికులకు చికిత్స చేసే సమయం లో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణం గా శస్త్రచికిత్స ద్వారా అవయవాలను తొలగించి ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములు శరీరం మొత్తం వ్యాపించ కుండా ప్రాణ హాని ని తగ్గించే వారు.కానీ అప్పట్లో సూక్ష్మ జీవులతో పోరాడటానికి సరైన మందులు వైద్య శాస్త్రానికి అందుబాటులో లేకపోవడంతో శస్త్ర చికిత్సలు విజయవంతమైనప్పటికీ సూక్ష్మజీవుల ద్వారా కలిగే ఇన్ఫెక్షన్స్ ప్రాణాంతకం గా పరిణమించేవి.

౧౯౨౯ లో అలేక్జాన్దర్ ఫ్లెమింగ్ అనే ఆంగ్ల శాస్త్ర వేత్త అనుకోకుండా పెనిసిల్లియం అనే ఒక రకమైన శిలీన్ద్రం స్తఫిలోకోకస్ అనే బాక్టీరియా పెరుగుదలను అడుపుచేయగల పెనిసిలిన్ అనే ఔషధాన్ని ఉత్పత్తి చేయడం గమనించాడు.ఈ ఔషధాన్ని శుద్ధి చేసి చికిత్స కోసం తయారు చెయ్యడానికి హోవార్డ్ ఫ్లోరీ మరియు ఎర్నెస్ట్ చైన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలకు దశాబ్దం పైగా సమయం పట్టింది.౧౯౪౨ లో మొట్టమొదటి సారిగా వీరు ఇరువురూ తయారు చేసిన పెనిసిల్లిన్ యాంటి బయాటిక్ ని ఒక గాయ పడిన వ్యక్తి కి అందించి బాక్తీరియల్ ఇన్ఫెక్షన్ ను అదుపు చేయ గలిగారు.కానీ సరైన మోతాదు లో శుద్ధి చేయబడిన పెనిసిల్లిన్ లభ్యం కాలేక పోవడం తో ఆ రోగి మృతి చెందాడు.ఆ తరువాత పెనిసిల్లిన్ విరివిగా వాడుక లో కి వచ్చింది.పలు రకాల ఇతర యాన్తిబయాతిక్స్ ను కూడా శాస్త్రజ్ఞులు త్వరిత గతిన కనుగొని మరిన్ని వ్యాధులను అంతం చేసే మార్గం సుగమం చేశారు.అలేక్జాన్దర్ ఫ్లెమింగ్,ఫ్లోరీ,చైన్ లు నోబెల్ ప్రైజు కూడా గెలుచుకున్నారు.తన నోబెల్ ప్రైజు స్వీకార ప్రసంగంలో నే అలేక్జాన్దర్ ఫ్లెమింగ్ యాంటి బయాటిక్ రేసిస్తంట్ క్రిముల పరిణామ ప్రక్రియ గురించి హెచ్చరించడం విశేషం.
    మితి మీరిన యాంటి బయాటిక్ ల వాడకం వలన భారత దేశంలో చాలా రకాల సాధారణ యాన్తిబయాతిక్స్ కు లొంగని క్రిములు ప్రబలి ప్రపంచ వ్యాప్తం గా వ్యాపిస్తున్నట్లు ది లాన్సెట్ మెడికల్ జర్నల్ లో మూడేళ్ళ క్రితం ప్రచురింప బడిన ఒక పరిశోధనాత్మక వ్యాసం పేర్కొంది.మన దేశం లో " న్యూ ఢిల్లీ మేటల్లో బీటా లాక్టమేజ్" అనే ఎంజైమ్ ను ఉత్పత్తి చేయడం ద్వారా యాన్తిబయాతటిక్ లను నిర్వీర్యం చేసే బాక్టీరియాలు, సంబంధిత జన్యువులు అతివేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ఇటువంటి వార్త ల ద్వారా తెలుస్తోంది.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మితి మీరిన యాన్తిబయాతిక్ ల వినియోగానికి అడ్డుకట్ట వెయ్యక పోతే చాలా మంది ప్రజలు యాంటి బయాటిక్ రెసిస్టన్స్  జన్యువులు కలిగిన క్రిముల ద్వారా వ్యాపించే  ఆరోగ్య సమస్యల కు ప్రాణాలు బలిచేయాల్సి వస్తుంది.అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలాలో యాంటి బయాటిక్స్ వాడకాన్ని ప్రభుత్వం అతి సమర్థ వంతం గా నియంత్రించి దేశ ఆరోగ్య భద్రతను కాపాడుతున్నట్లు ఇండియా టుడే పత్రిక తన మర్చి ౮ కథనం లో పేర్కొంది.

24, ఫిబ్రవరి 2013, ఆదివారం

బెంగళూరు సంప్రదాయక హోటళ్ళు #2 బ్రాహ్మణుల కాఫీ బార్, శంకర పురం, బసవన గుడి



బెంగళూరు సంప్రదాయక హోటళ్ళ పై రాస్తున్న రెండవ టపా ఇది.ఇప్పటికే ఈ హోటళ్ల గురించి బెంగళూరు వాసులైన చాలా మంది తెలుగు బ్లాగర్స్ కి తెలిసి ఉండవచ్చు.మిగిలిన వారికి బెంగళూరు లో నేను ముఖ్య మైన అంశం గా భావించే చిన్న హోటల్స్ గురించి నా బ్లాగ్ ద్వారా తెలియబరచాలనే ఉద్దేశ్యంతో ఈ టపాలను ప్రచురిస్తున్నాను.

      బ్రాహ్మణుల కాఫీ బార్ గా పిలువబడే ఈ చిన్న హోటల్  దక్షిణ బెంగళూరు వాసులకు కొన్ని దశాబ్దాలు గా సుపరిచితం.ఈ హోటల్ చామరాజ్ పెట్ మరియు గాంధీ బజార్ నుంచి కూత వేటు దూరం లో శంకర పురం లో ఉంది.ఫెబ్రవరి మాసం తొలి ఆదివారం టైమ్స్ అఫ్ ఇండియా పత్రిక లో జి ఎస్ కుమార్ ఈ కాఫీ బార్ గురించి రాసిన డిలైట్ ఫుల్ ఇడ్లి అండ్ దోస ఫేర్ ఫర్ ఎర్లీ బర్డ్స్  అనే ఆర్టికల్ చదివాను.గత ఎనిమిదేళ్ళ నుంచి సాయంకాలం పూట ఇంటికెళ్ళే ముందు అప్పుడప్పుడూ మిత్రులతో కలిసి అక్కడికి వెళ్లడం నాకు అలవాటు. అప్పట్లో ఈ కొట్టు చాలా చిన్న గా ఉండేది గానీ ఎప్పుడూ జనసమ్మర్ధం గా ఉండేది.రెండేళ్ళ క్రితం పునర్నిర్మించారు.అయినా వారి మెనూ లో ఎటువంటి మార్పు లేదు. బ్రాహ్మణుల కాఫీ బార్ లోకాఫీ, టీలతో పాటు   ఇడ్లి,దోస,ఉద్దిన వడ మరియు ఖారా బాత్ దొరుకుతాయి.ఇన్నేళ్ళలో రుచి లో నూ నాణ్యత లో ఎలా౦టి తేడా కనిపించట్లేదు.

పై చిత్రం లో మాజీ కేంద్ర మంత్రి, కర్నాటక బి.జే.పి అగ్ర నాయకుడు అనంత్ కుమార్ ఇక్కడ ఆహారాన్ని ఆస్వాదిస్తుండడం చూడవచ్చు.ఈయన లాగే చాలా మంది ప్రముఖులు ఇక్కడికి తరచుగా వస్తూ ఉంటారట.

18, ఫిబ్రవరి 2013, సోమవారం

నమ్మితీరాల్సిన నిజం : మన శరీరం సూక్ష్మ జీవుల మయం.(బాక్టీరియా , వైరస్ ల మయం)

చిన్నప్పుడు స్కూల్ లో సూక్ష్మ జీవుల గురించి తెలుసుకున్నప్పటినుంచి, సూక్ష్మ జీవులన్నీ రోగాలను కలుగజేస్తాయని మనలో కొందరు అపోహ పడుతుంటారు. అసలు విషయం ఏమిటంటే, మన శరీరం మొత్తం దాదాపు 100 ట్రిలియన్ సూక్ష్మ జీవ కణాలకు నిత్య ఆవాస నిలయం. రోగ పీడుతులు కాని అత్యంత ఆరోగ్యవంతుల శరీరం లో కూడా వివిధ అవయవ వ్యవస్థలు సూక్ష్మ జీవులకు ఆవాస కేంద్రాలు గా నిలుస్తున్నాయి.మన చర్మం,కేశములు,రోమములు,రోమ రంధ్రాలు,కేశమూలాలు,ముక్కు,శ్వాశ నాళాలు,నోరు,ప్రేగులు, మర్మావయవాలు, ఇంకా ఇతర అవయవాలు కొన్ని మంచి సూక్ష్మ జీవులను కలిగి ఉండడమే కాకుండా వీటి వలన మనం లబ్ది పోదేలా చేస్తున్నాయి. మన శరీరం లో నివసిస్తున్న అన్ని సూక్ష్మ జీవులనూ కలిపి హ్యుమన్ "మైక్రో బయోం" అని పిలుస్తాం. సూక్ష్మ జీవుల వలన కలిగే అంటూ వ్యాధులను మన భూమిపై ఉన్న కేవలం అతి కొద్ది శాతం సూక్ష్మ జీవులు మాత్రమే కలుగ జేస్తాయి.ఇప్పటి వరకు భూమి మీద మనకు తెలిసిన అన్ని సూక్ష్మ జీవుల  ( అంటే- నేల, నీరు, గాలి,చెట్లు మరియు ఇతర జంతువులలో ఉన్నవి) సంఖ్యతో పోల్చితే , వ్యాధి కారక సూక్ష్మ జీవుల సంఖ్య అత్యల్పం.కానీ  మానవుని ఉనికికి ప్రమాదం కలిగించే శక్తి ప్రస్తుతం ఈ అతి స్వల్ప సంఖ్యాక వ్యాధి కారక సూక్ష్మ జీవులకు మాత్ర్హమే ఉంది! యుధాలు, ప్రకృతి వైపరీత్యాల తరువాత, భారీ ఏత్తున మానవ జన నష్టం కలిగించే  సామర్థ్యం కేవలం ఈ వ్యాధి కారక సూక్ష్మ జీవులకు మాత్రమే ఉంది.బాక్టీరియా,వైరస్ , ఫంగై (శిలీంధ్రాలు, బూజు), ఆల్గే(నాచు), ప్రోటో జోవన్లను సూక్ష్మ జీవులు అని అంటారు.వీటిని మనం కంటితో నేరు గా చూడలేం.సూక్ష్మ దర్శిని (మైక్రో స్కోప్) వినియోగించి మాత్రమే చూడగలం కాబట్టే వీటిని సూక్ష్మ జీవులు అని పిలుస్తాం.
      పై చిత్రం లో ఎడమ వైపు మన శరీర సహజ రోగ నిరోధక వ్యవస్థ లోని భాగాలు, కుడి వైపు మానవ శరీరం లో సహజం గా జీవిస్తున్న సూక్ష్మ జీవుల ను పెర్కోనడం జరిగింది. మనకు వ్యాధులు సంక్రమించకుండా ఈ మంచి బాక్టీరియా  రోగ నిరోధక వ్యవస్థతో కలిసి పనిచేస్తాయి.
  మానవ శరీరం లోకి ఈ సూక్ష్మ జీవులు ఎలా ప్రవేశిస్తాయి? అనే సందేహం తలెత్త వచ్చు.ఇవి మన దేహంలోకి మనం తల్లి గర్భంలోంచి బయటకు వచ్చే సమయం నుండి జీవితాంతం శ్వాశ క్రియ,నీరు త్రాగడం,ఆహారం,కొన్ని ప్రో-బయోటిక్ ఔషధ సేవనం లాంటి వివిధ సహజ ప్రక్రియల ద్వారా మన దేహము లోనికి ప్రవేశిస్తాయి.బిడ్డ పుడుతున్న సమయంలో తల్లి జననాంగాల నుంచి అనేక రకాల బాక్టీరియాలు మన దేహం లోనికి ప్రవేశిస్తాయి.గర్భిణీ స్త్రీల జననాన్గాలపై ఉన్న సూక్ష్మ జీవులు శిశువు జీర్ణవ్యవస్థ లో ఆవాసం ఏర్పరచు కొని ( ప్రేవులలో) తల్లి పాలను జీర్ణం చేయడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి.ఈ సూక్ష్మ జీవుల సంఖ్యా ఇతర స్త్రీల కంటే గర్భిణీ స్త్రీ లలో అధికంగా ఉంటుంది. తల్లి పాలను త్రాగుతున్నంత కాలం శిశువు శరీరం కొత్త కొత్త సూక్ష్మ జీవులను తన దేహమ్లోనికి స్వీకరిస్తూనే ఉంటుంది.
  బిడ్డ పెరిగి పెద్దవాడైన తరువాత దేహం లో ని సూక్ష్మ జీవుల జనాభా లో చాలా క్లిష్ట మైన మార్పులు చేర్పులు జరుగుతాయి.అదే సమయంలో ఈ సూక్ష్మ జీవులు శరీర రోగ నిరోధక వ్యవస్థ కు రోగ కారక క్రిములను ఎదుర్కోవడానికి అవసరమయ్యే వివిధ యంత్రాంగాలను పటిష్ట పరచుకోనేలా కూడా చేస్తాయి.మనం పెరిగే వయసులో అతి త్జక్కువ క్రిములకు మాత్రమే ఎదురు పడితే అంటే, అవసరానికి మించి అతి గా శుచి శుభ్రతలకు అలవాతుపడినా, లేదా అవసరానికి మించి అంటిబయాటిక్ ఔషధాలను వాడడం అలవరచుకున్నా అల్లర్జీ లాంటి రుగ్మతల బారిన పడే అవకాశం చాలా ఎక్కువ గా ఉంటుందని వైద్య శాస్త్ర పరిశాధనలలో తేలింది.అంటి బయాటిక్స్ ను అతి గా వినియోగించడం వలన మన శరీరం లో ని మేలు కలిగించే క్రిములను చాలా వరకు నష్ట పోతాం.అందుకనే , ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి డాక్టర్లు అంటి బయాటిక్స్ ప్రేస్క్రైబ్ చేసేటప్పుడు వాటి తో పాటు ఏదైనా ప్రో-బయోటిక్  పొడిని గానీ, మాత్రలను గానీ వాడమని చెబుతారు.మనం ఈ ప్రో బయోటిక్  మందుల కవర్ పై ముద్రించిన విషయాలను చదివితే ప్రో-బయోటిక్ ఉత్పాదనలో చాలా లాక్టిక్ ఆమ్లాన్ని తయారు చేసే బాక్టీరియా ల పేర్లు మనకు కనిపిస్తాయి. ఇవి మన పెద్ద ప్రేగును చేరి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకొని హాని కారక క్రిముల వలన విరోచనాలు, అతిసార వ్యాధి కలగకుండా కాపాడుతాయి.మనం యోఘుర్ట్,పెరుగు,మజ్జిగ లాంటి పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో ని మంచి సూక్ష్మ జీవుల సమతుల్యతను కాపాడుకోవచ్చు.
                 మన దేహంలో నివసించే సూక్ష్మ జీవుల వైవిధ్యాన్ని కనిపెట్టడం చాలా కష్టం. న్యూ యార్క్ టైమ్స్ దిన పత్రిక గత జూన్ ౧౮ వ తేదీ ప్రచురించిన కథనం ప్రకారం మానవుని నోటి లో 75 నుంచి  100 జాతుల (స్పీసీస్) సూక్ష్మ జీవులు ఉండవచ్చు. ఒకరి నోటి లో ఉన్న కొన్ని సూక్ష్మ జీవులు ఇంకొకరి నోటిలో ఉండక పోవచ్చు.మరొక అంచనా ప్రకారం మన నోటిలో ఉన్న సూక్ష్మ జీవుల జాతుల సంఖ్యా దాదాపు గా 5000 ఉండవచ్చు.
   మన శరీరం లో బాక్టీరియా తో పాటు వైరస్ లు కూడా ఉన్నాయి.ఈ వైరస్లలో చాలా భాగం మన శరీరం లో ని వైర ల పై పరాన్న జీవులు గా పనిచేస్తుననాయి.అంటే మన శరీరం ఒక సూక్ష్మ జీవ జాలాన్ని కలిగి ఉందన్నమాట.దీన్నే ఆంగ్లం లో ఇకో సిస్టం అంటారు. మనం మన శరీరం లో ఇలాంటి సూక్ష్మ జీవుల ఇకో సిస్టం ను కొనసాగిస్తున్నాం.
మన మైక్రో బయోం లో దాదాపు నూరు జాతుల ఫంగై కూడా ఉన్నాయట.

 అమెరికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ సంస్థ ఐదేళ్ల పాటు 80 పరిశోధక సంస్థలకు చెందిన 200 వందలమంది శాస్త్రవేత్తలతో కలిసి 250 మంది వాలంటీర్ల సహజ సూక్ష్మ జీవ జాలం పై హుమన్ మైక్రో బయోం ప్రాజెక్ట్ ను నిర్వహించింది.ఈ అధ్యయనం లో భాగం గా  250 మంది వాలంటీర్ల శరీరాల నుంచి సేకరించిన సూక్ష్మ జీవుల నమూనా ల డి.ఎన్.ఏ సీక్వెన్సింగ్ నిర్వహించారు. ఈ అధ్యయనం లో పాల్గొన్న వాలన్టీర్లు అందరూ తమకు దేహంలో ఎక్కడా ఎటువంటి సూక్ష్మ జీవ జనిత వ్యాధులు లేవని వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకొన్న తరువాతనే ఈ అధ్యయనం లో భాగం కావిన్చబడ్డారు.ఈ అధ్యయనం పర్యవసానం ఏమిటంటే భవిష్యత్తులో మన రోగాలకు చికిత్స చేసేముందు వైద్యులు మన శరీరం లో ని మైక్రోబయోమే ని దృష్టి లో ఉంచుకొని వైద్యం చేస్తారు.మార్కెట్ లో లభ్యమవుతున్న చాలా అన్తిబయాటిక్స్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ని నయం చేయలేక పోతున్నాయి.దీనికి కారణం రోగ కారక క్రిములు జన్యు పరం గా అంటి బయాటిక్స్ ను నిర్వీర్యం చేయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించు కోవడమే.ఈ ప్రక్రియను అంటి బయాటిక్ రెసిస్టన్స్ అని అంటాం.అంటి బయాటిక్ రెసిస్టన్స్ జన్యువులు పర్యావరణం లో విరివి గా ఒక బాక్తెరియా నుంచి ఇంకొక బాక్టీరియా కు సంక్రమిస్తుండడం వలన విపరీతం గా అంటి బయాటిక్స్ ను తట్టుకో గలిగే రోగ కారక క్రిములు శరవేగం గా తయారై ప్రాణ సంకటం గా సంక్రమిస్తునాయి.హుమన్ మైక్రో బయోం పై శాస్త్రీయ అవగాహన కలగడం వలన అన్తిబయాతిక్స్ లేకుండా నే అంటు రోగాలకు చికిత్స చేయడం సులభ తరం కావచ్చు.

  చాలా వరకు మనం  కేవలం ఒక వ్యక్తి గా పరిగానణిమ్చబడుతుంటాం.. ఇప్పుడు మనలో కొన్ని వేల రకాల సూక్ష్మ జీవులు కూడా బ్రతుకుతున్నాయని తెలుసుకున్న తరువాత మనం ప్రకృతి లో ఒక భాగం అనుకోవాలా? లేదా మనమే ఈ సూక్ష్మ జీవులకు ఆధారభూతమైన ఒక  ప్రకృతి అనుకోవాలా? మనం మన కోసం మాత్రమే భోజనం  చేస్తున్నామా లేదా మనకు తెలియకుండా మనలో స్థిర నివాసం ఏర్పరచుకొని మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఈ మైక్రోస్కోపిక్ జీవ లోకం కోసం బ్రతుకుతున్నామా?విజ్ఞాన శాస్త్ర పురోగతి ఇలాంటి ప్రశ్నలకు మున్ముందు సహేతుకమైన సమాధానాలను అందిస్తుందని ఆశిద్దాం.ఈ టపా చదివిన తరువాత కూడా ఇంకా కొంత సమాచారం కోసం అన్వేషించదలచె వారు ఈ బ్లాగ్ పోస్ట్ ను అనుసరించగలరు.ఇందులో ఇతర ఉపయోగకర సమాచారాన్ని అందించే మరికొన్ని కథనాలకు లంకెలున్నాయి.


13, ఫిబ్రవరి 2013, బుధవారం

నానో టెక్నాలజీ -అపాయాలకు అవకాశాలు

ఒక మీటర్ లో 100,000,00,00,000 వ వంతును (ఒన్ బిల్లియంత్  అఫ్ ఏ మీటర్) ను నానో మీటర్ అని పిలుస్తాం.వికీపీడియా ప్రకారం ఒక నానో మీటర్ ఒక మీటర్ లో లక్ష కోటవ వంతుకు సమానం.అంటే ఒక మీటర్ ను లక్ష కోట్ల సమభాగాలు గా విన్హజిస్తే , ప్రతిభాగం ఒక నానో మీటర్ కొలతను కలిగి ఉంటుందన్న మాట.ఈ వికీపీడియా వ్యాసం లో  "నానో టెక్నాలజీ" ని "పరమాణు సూక్ష్మ సాంకేతిక పరిజ్ఞానం" గా పేర్కొన్నారు.
                                                                               ఒక నానో మీటర్ నుంచి నూరు నానో మీటర్ల పరిమాణం లో ఉన్న పదార్థాలను నానో రేణువులు(నానో పార్టికల్స్) అని అంటారు.ఒక నానో మీటర్ నుంచి నూరు నానో మీటర్ల పరిమాణం గల పదార్థాలను ,వస్తువులను, రేణువులను, యంత్రాలను తయారు చేయడం,ఆ పరిమాణం గల వస్తువులను మార్పులకు గురి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని నానో టేక్నాలజీ అని పిస్తారు.ఇటీవలి కాలం లో నానో టెక్నాలజీ రంగం  బాగా వ్యాప్తిలోకి వచ్చింది.సౌందర్య సాధనాలు,ఆహార పదార్థాలు, కంపూటర్లు,టీవీ ల లాంటి వినోద సాధనాలు,పెయింట్ , ఆహార పదార్థాల తయారీ, ఆయుధాల తయారీ, సమాచార ప్రసార వ్యవస్థ , వైద్య రంగం లో నానో టెక్నాలజీ వినియోగం వలన రానున్న రోజులలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.

                                            భారత ప్రభుత్వం కూడా ఈ రంగంలో పరిశోధనలను అనేక విధాలుగా ప్రోత్సహిస్తోంది.యూరోపియన్ కమిషన్  దేశాలు,అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, చైనా, జపాన్, జర్మనీ ఇంకా ఇతర దేశాలకు చెందిన పరిశోధన సంస్థలు, పరిశ్రమలు ఈ నానోటెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త పరికరాలను తయారు చేసే పని లో నిమగ్నమై ఉన్నాయి.ఈ   నానోటేక్నాలజీ గురించి మరింత సమాచారం తెలుసుకోగోరే వారు పైన ప్రస్తావించిన వికీపెడియా లంకె ను అనుసరించగలరు.
                                              ఇప్పటికే మనోన్మణియన్ సుందరనార్ యూనివర్సిటీ లాంటి కొన్ని విద్యాసంస్థలు నానో బయో టేక్నాలజీ కోర్సులను అందిస్తునాయి. ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగంలో "కీడెంచి మేలెంచు" అనే దృక్పథం ప్రస్తుతానికి చాలా తక్కువమంది శాస్త్రవేత్తలు, వ్యాపార వేత్తలకు మాత్రమె ఉంది.కొన్ని నూతన పరికరాలను , నూతన శాస్త్ర విజ్ఞానాన్ని వాడేటప్పుడు కొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన కలిగే స్వల్ప కాలిక దీర్ఘ కాలిక పర్యవసానాలను అంచనా వేయడం,అధ్యయనం చేసి సమగ్ర మైన వ్యక్తిగత ,సామాజిక ,పర్యావరణ  భద్రతకు సంబంధించిన అంశాలను క్రోడీకరించి జనసామాన్యానికి అందుబాటులో ఉంచడం చాలా అవసరం.

        ఏ పదార్థాన్నయినా అతి సూక్ష్మ స్థాయి లో మార్పు చేస్తున్నప్పుడు అను రేణువుల స్థాయి లో పదార్థ ప్రవర్తన,స్వభావం చాలా మార్పులను చూపిస్తుంది.పరమాణు సూక్ష్మస్థాయి రేణువుల ఉపరితల వైశాల్యం చాలా ఎక్కువగా ఉండడం తో అవి భౌతిక రసాయనిక చర్యలలో అతి వేగంగా పాల్గొని ప్రాణ హాని కలిగించే విష పదార్థాలుగా పరివర్తన చెంది వివిధ ఆరోగ్య సమస్యలను కలిగించ వచ్చు.2008 మార్చి మాసం లో సైంటిఫిక్ అమెరికన్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఫ్రెండ్స్ అఫ్ ఎర్త్ అనే పర్యావరణ సంస్థ దాదాపు వంద వరకూ నానో టెక్నాలజీ ఆధారిత ఆహారపదార్థాలు అమెరికన్ మార్కెట్లో వినిమయములో ఉన్నట్లు గుర్తించింది. ఈ కథనం ప్రకారం ఎన్విరోన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2005 లో జరిపిన ప్రయోగాలలో జింక్ ఆక్సైడ్ నానో రేణువులు అతి తక్కువ పరిమాణం లో కూడా మానవుని ఊపిరితిత్తుల కణాలకుసంబంధించిన  సమస్యలను కలిగిస్తాయని తేలింది.ఎలుకలపై జరిపిన మరికొన్ని ప్రయోగాలలో వెండి నానో రేణువులు కాలేయ కణాలు, మెదడు లోని కణాలను చంపివేసే సామర్థ్యాన్ని కలిగిఉన్నాయని కనుగొన్నారట.


       గత కొద్ది కాలం గా అంతర్జాలం లో మరియు సైంటిఫిక్ జర్నల్స్ లో ప్రచురితమౌతున్న పరిశోధనాత్మక వ్యాసాలు నానో టెక్నాలజీ లో భద్రతా పరమైన చిక్కులు తలెత్తే ప్రమాదం ఉండబోతుందని హెచ్చరిస్తున్నాయి.నానో టెక్నాలజీ ఉత్పత్తులు వాడే వినియోగదారులు, తయారీ లో పాల్గొనే ఉద్యోగులు, నిపుణులు, నానో టెక్నాలజీ ఆధారిత వ్యర్థ పదార్థాల ప్రభావానికి లోనయ్యే వారు  ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.ఈ కొత్త సాంకేతిక శాస్త్ర  ఆధారిత ఉత్పత్తులను భారీ ఎత్తున తయారు చేసి మార్కెట్లోకి వదిలేముందు భద్రతా పరమైన అంశాలపై కూడా సమగ్ర పరిశోధనలు జరపాల్సిన భాద్యత ప్రభుత్వాలకు, శాస్త్ర వేత్తలకు ఉన్నది. మరిన్ని వివరాలకు  పార్టికల్ అండ్ ఫిబెర్ టాక్సికాలజీ అనే అంతర్జాల జర్నల్  2006 లో ప్రచురించిన "ది పోటేన్శిఅల్ రిస్క్స్ అఫ్ నానో మటీరియల్స్: ఏ రివ్యూ కారీడ్ అవుట్ ఫర్ ఈసిఈటిఈసి" అనే పేరుతో ప్రచురించిన వ్యాసాన్నిచదవగలరు.

    

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

కొత్త ప్రైవేటు విశ్వ విద్యాలయాలు వెనుక దాగిన మర్మం?

థామ్సన్ రాయిటర్స్ సంస్థ సహకారంతో టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సప్లిమెంట్ ప్రకటించిన ప్రపంచం లో ని నాలుగు వందల ఉత్తమ శ్రేణి విశ్వ విద్యాలయాల జాబితా (౨౦౧౨ సంవత్సరానికి)లో మన దేశానికి చెందిన మూడు విశ్వవిద్యాలయాలకు మాత్రమే చోటు దక్కింది.మూడూ ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లె కావడం గమనార్హం.
 మన దేశం లో వందల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఏ ఒక్కటీ ఈ జాబితా లో చేర్చబడలేదు.దీనికి కారణాలు చాలా ఉండవచ్చు.ఇక్కడ ప్రస్తావించడం పెద్దగా ఉపయోగించక పోవచ్చు.ఐ ఐ టీ ల లాంటి అత్యుత్తమ శ్రేణి విశ్వవిద్యాలయాల మినహా మిగతా విశ్వవిద్యాలయాలలో నాణ్యత లోపించడం ఒక కారణమా? ఐ ఐ టీ లలో పట్టభద్రులైన చాలా మంది ప్రతిభావంతులు ఈ జాబితా లో ని పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో పరిశోధకులు గానూ, అధ్యాపకులు గాను పనిచేస్తున్నారనేది జగమెరిగిన సత్యం.పరిశోధన పరం గా మన దేశం చైనా,కొరియా,జపాన్,సింగపూర్ లాంటి ఆసియా దేశాలకంటే చాలా వెనుకబడి ఉంది.పాశ్చాత్య దేశాలు విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులకు పరిశోధనాత్మక బోధనను అందిస్తూ వారిని ప్రపంచంలో నే అత్యంత ప్రతిభావంతమైన నిపుణులుగా తయారు చేస్తున్నాయి.అక్కడి విశ్వ విద్యాలయాలలో అండర్ గ్రాడుయేట్ స్థాయి నుంచే విద్యార్థులు పరిశోధనాత్మక వ్యాసాలను జర్నల్స్ లో ప్రచురించడం, కాన్ఫరెన్స్ ల లో తమ పరిశోధన విశేషాలను పంచుకోవడం లాంటి పనులను  మంచినీళ్ళు త్హగినంత అలవోక గా చేసేస్తున్నారు.కానీ మన కాలేజి లు, విశ్వవిద్యాలయాలలో ఈ స్థాయి కి చేరడం ప్రస్తుతానికి ఎం.ఫిల్,పి .హెచ్.డి పరిశోధకులకు మాత్రమే వీలవుతోంది.విద్యార్థులలో పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించడం లో ఎందుకనో మనం వెనుకబడి ఉన్నాం.మంచి పరిశోధనలు జరగక పోతే శాస్త్ర సాంకేతిక రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించ గలగడం,అభివృద్ధి చెందినా దేశాలలతో పోటీ పడడం ఒక కల లాగే మిగిలి పోవచ్చు. మన దేశం ప్రపంచంలో ని అగ్ర  దేశాల జాబితాలో నిలవాలంటే పరిశోధన రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎంతైనా ముఖ్యం.
  కానీ ఉన్నత విద్యలో ప్రభుత్వ పెట్టుబడులను క్రమేణా తిగ్గించే సూచనలు స్పష్టం గా కనిపిస్తున్నై.కర్ణాటక ప్రభుత్వం  డిసెంబర్ నెలలో ఎకమగా 13 ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఆమోదం తెలపడం, మహారాష్ట్ర కూడా అదే బాటలో పయనిస్తుండడం, తమిళ నాడు లో కూడా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు భారీగా రంగంలో కి రావడం ఈ భావన కు ఊతం ఇస్తోంది.ఇది వరకూ యు.జి.సి గుర్తింపు పొందిన కోర్సుల పట్ల మాత్రమే మొగ్గు చూపిన ప్రజానీకం ఉన్నత విద్యాభ్యాసానికి ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఎంచుకుంటుందో లేదో. కొద్ది రోజులలో తెలియబోతోంది.రాబోయే రోజులలో భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు విద్యారంగం లో  భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిన్చానుందని మీరా నంద రాసిన "ది గాడ్ మార్కెట్" అనే పుస్తకం లో పేర్కొన్నారు.దేశం లో ని చాలా కళాశాలలు విశ్వవిద్యాలయాలు రాజకీయ నాయకులో, వారి కుటుంబ సభ్యులో,అనుయాయులో నడుపుతుండడం వలన విద్యా రంగం లో విదేశీ పెట్టుబడులను ఆమోదించే బిల్లు ను  గత పది పదిహేనేళ్ళుగా చట్టసభలలో ఆమోదించడం కష్టతరం అవుతోంది.విపరీతంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతులివ్వడం ద్వారా పరోక్షంగా ప్రభుత్వం విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశం లో నేరు గా ప్రవేశించే అవకాశాన్ని కల్పిస్తుందేమో అనిపిస్తోంది.

8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

బెంగళూరు సంప్రదాయక హోటళ్ళు: ద్వారక వెజ్ ఎన్.ఆర్.కాలని

బెంగళూరు అనగానే మనలో చాలా మందికి వెంటనే గుర్తుకొచ్చేవి విలాసవంతమైన భవంతులు, ఆకాశ హర్మ్యాలు,సాఫ్ట్ వేర్ ఆఫీసులు, ఇంజినీర్లు,వందల సంఖ్యలో ఉన్న కాలేజి లు, తిండి విషయానికి వస్తే ఆధునిక బహుళ జాతి ఫాస్ట్ ఫుడ్ దుకాణాలు, షాపింగ్ మాల్స్ ఇవన్నీ.కానీ బెంగళూరు నగరం ఆధునికతకు ప్రతీకగా నిలుస్తున్నప్పటికీ, ఈ నగరానికి మనందరికీ చాలా సులభంగా తెలిసే మరొక కోణం కూడా ఉంది.అదే ఇక్కడి సాంప్రదాయక చిరుతిళ్ళ అంగళ్ళు, కొన్ని దశాబ్దాలు గా వినియోగదారులను అలరిస్తున్న అల్పాహార ఉపాహార శాలలు.
              బెంగళూరులో సాయంత్రం పూట రోడ్డు పై కి అడుగిడుతూనే ఫుట్ పత ల పై, హోటళ్ల్ల ముంగిట్లో కిట కితలాడుతూ జనం కనిపిస్తారు.బహుశా సాఫ్ట్ వేర్ సంస్థలు,రియల్ ఎస్టేట్,విద్యా సంస్థల తరువాత అంత భారీ స్థాయిలో వ్యాపారం జరిగేది అల్పాహార, ఉపాహార శాలలు మరియు భోజన శాలలో మాత్రమేనేమో.ఇక్కడ స్వాతంత్ర్య పోరాట కాలం నుంచీ , అంటే దాదాపు ఒక శతాబ్ద కాలం నుంచీ విజయవంతం గా నిర్వహించ బడుతున్న అనేక చారిత్రాత్మక హోటల్స్ ఉన్నాయి.కొన్ని హోటల్స్ ని జవహర్ లాల్ నెహ్రు,రాజాజీ లాంటి మహామహులు సందర్శించి న దాఖలల్లు కూడా ఉన్నాయి.సూపెర్ స్టార్ రజనీ కాంత్ స్వస్థలమైన బెంగళూరు కు వచ్చిన ప్రతి సారీ తనకు నచ్చిన చిన్న చిన్న హోటల్స్ కి వెళ్ళుతుంటారని అప్పుడప్పుడూ ప్రచార మాధ్యమాల ద్వారా తెలుస్తుంది.
        బెంగళూరు మహానగరం శాఖాహార భోజనశాలలకు పెట్టింది పేరు.(ఇప్పుడు ఈ మాట అనడం చాలా కష్టం అనుకోండి.ఎందుకంటే,పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బహుళ జాతి ఆహార విక్రయశాలలకు ప్రధాన కేంద్రం గా నూ పరిగనిణ్చ బడవచ్చు).ముఖ్యంగా బెంగళూరు దక్షిణ భాగం లో చాలా చిన్న చిన్న దక్షిణ భారత శైలి హోటల్స్ ఉన్నాయి.వీటిలో ప్రధానం గా సున్నితంగా ఉన్న కర్నాటక శైలి ఇడ్లీలు , కరకర లాడే మినప వడలు, చౌ చౌ బాత్ (కేసరి , ఉప్మా ల కాంబినేషన్ ),పులియోగరే( పులిహోర కర్నాటక వెర్షన్ ), అవలక్కి బాత్( అటుకుల  , ఘుమ ఘుమ లాడే రుచికరమైన ఫిల్టర్ కాఫీ, టీ దొరుకుతాయి.బసవన గుడి, గాంధి బజార్,హనుమంత్ నగర్,జయ నగర్, బనశంకరి ౨ వ స్టేజ్ లలో ఇలాంటి హోటల్స్ చాలా ఉన్నాయి.
     నిన్న మిత్రుల తో కలిసి ఎన్ ఆర్ కాలనీ లో ఉన్న ద్వారకా వెజ్ కి వెళ్లాను.మిత్రులు  ప్రోఫ్.జయ రామ రెడ్డి గారు  కాలేజ్ లో ని సివిల్ ఇంజినీరింగ్ విభాగం లో చేరి ఒక సంవత్సర కాలం గడిచిన సందర్భాన్ని పురస్కరించిఉకొని మాకు ద్వారక లో చిన్న విందు ఇచ్చారు.నేను తరచూ ఈ ప్రాంతంలో నే తిరుగుతున్నప్పటికీ ఎప్పుడూ ఈ హోటల కి వెళ్ళలేదు.రెడ్డి గారి స్వస్థలం బెంగళూరు కావడం వాళ్ళ వారికి ఇలాంటి ప్రదేశాలన్నీ చిర పరిచితాలు.వారి పుణ్యమా అని అక్కడ టిఫిన్ చేసే అవకాశం దొరకడం తో ఈ హోటల్ గురించి మిత్రుల ప్రోత్సాహం తో బ్లాగ్ పోస్ట్ రాస్తున్నాను.
   ఇక్కడ ముఖ్యంగా ఖాళి దోస బాగా అమ్ముదవుతూ ఉంటుంది.మేము ఖాళి దోస తో పాటు కారెట్ హల్వా , కాఫీ పుచ్చుకున్నాం.ఖాళీ దోస అంటే తెలుగులో సాదా దోస లేదా ప్లెయిన్ దోస లాంటిది.కానీ కొంచెం మందం గా సుతి మెత్త గా ఉంటుంది.అదనపు చట్నీ అవసరం అయినప్పుడు అపరిమితం గా చట్నీ ఇస్తూనే ఉంటారు (అంటేమనం దోస తినే వరకు అన్న మాట).చట్నీ వడ్డించా డానికి ఒక ప్రత్యేకమైన సర్వర్ కూడా ఉంటాడు.ఇలాంటి వడ్డన విషయంలో తమిళ నాడు లోని కొన్ని హోటల్స్ తో పోలిస్తే ఇక్కది హోటల్స్ వారు కొంత పట్టు విడుపు గా ఉంటారు  అనే చెప్పొచు.చాలా పాత కాలం హోటల్ కనుక  ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ హోటల్స్ లాగా మనం వేగంగా నిలుచుకొని తినేటన్దుకే కాకుండా సౌకర్యవంతం  గా  కూర్చుని తినే వెసులుబాటు కూడా ఉంది.దోస తో ఇడ్లి,ఉత్తర భారత తినుభందారాలు,పూరీ ల లాంటి ఇతర పదార్థాలు దొరుకుతున్నప్పటికీ కస్టమర్స్ అందరూ ఖాళి దోస మాత్రమె కొనడం చోసాను.కౌంటర్లో ఉన్నవారు వేడి వేడి పూరీ కూడా ఉంది అంటున్నప్పటికీ అందరూ దోస వైపే మొగ్గు చూపడం కనిపించింది.దీన్ని బట్టి ఇక్కడి దోస నాణ్యత అంచనా వెయ్యవచ్చనిపించింది.ఒకప్పుడు ఈ హోటల లో కస్ట్అమర్ల కు సూచనలిచ్చే అనేక బోర్డులున్దేవట అందుకని ఒకప్పుడు దీన్ని బోర్డ్ హోటల్ అనేవారట! ఇప్పుడు ఆ బోర్డులు లేవు లెండి.ఇప్పుడు ఈ హోటల్ ను కొత్తగా పునర్నిర్మించారు.
ఈ హోటల్ ఎన్ ఆర్ కాలనీ నుంచి హనుమత్న్త నగర వెళ్ళే దారిలో ఎడం వేపు కనిపిస్తుంది.

7, ఫిబ్రవరి 2013, గురువారం

అష్టావక్ర గీత

కొన్నేళ్ళ క్రితం జేమ్స్ ఫ్రై స్వీయ చరిత్ర "ఏ మిలియన్ లిటిల్ పీసెస్" చదివినప్పుడు అందులో రచయిత జీవితం లో పెను మార్పులు తీసుకొచ్చి అతడి మాదక ద్రవ్యాల వ్యసనాన్ని వదిలివేయ్యడానికి "దావో దే జింగ్ " అనే ప్రాచీన చైనీస్ పుస్తకం సహాయ పడినట్లు చదివాను. తరువాత ఆ పుస్తకం కోసం అంతర్జాలం లో నే కాక బెంగళూరు లో ఉన్న పుస్తకాల దుకానాలన్నిన్తిలో వెతికి చివరకు ఫోరం మాల్ లో ని "ల్యాండ్ మార్క్" దుకాణం లో శంభాల ప్రచురణ సంస్థ వారి  tao te ching ను కొన్నాను.కొద్ది రోజుల తరువాత డా.వెన్ దైఎర్ దావో దే జింగ్ పై రాసిన "చెంజ్ యువర్ థాట్స్ , చేంజ్ యువర్ లైఫ్" పుస్తకం కూడా చదివి చాలా ప్రభావితుణ్నయ్యాను.

    ఎన్నో వేల ఏళ్ళ ప్రాచీన చరిత్ర గల మన దేశం లో ఇలాంటి పుస్తకాలు లేక పోవడం ఏమిటా అని అప్పట్లో ఆశ్చర్య పడే వాణ్ని.మన భగవద్గీత ఇలాంటి ప్రాచీన వ్యక్తిత్వ వికాస పుస్తకాలలో ఒకటి  కావచ్చు కాబోలు అని అప్పటికి సర్ది చెప్పుకున్నాను. ఆర్నెల్ల క్రితం ఒక యాన్ద్రాయిడ్ పలక కొన్నప్పుడు ఈ బుక్స్ కోసం అంతర్జాలం లో వెదుకుతుండగా అష్టావక్ర గీత అనే పుస్తకం తటస్థించచడం జరిగింది. అష్టావక్ర గీత జనకునికి , అష్టావక్ర మహర్షి కీ జరిగిన తాత్విక సంభాషణ.భగవద్గీతలో ని కొన్ని విషయాలను కూడా ఈ పుస్తకంలో అష్టావక్ర మహర్షి జనకునికి చాలా సరళమైన శైలి లో సామాన్య మానవునికి కూడా అర్థమయ్యే విధంగా విడమరిచి చెప్పడం జరిగింది.మరి కొన్ని శ్లోకాలు జెన్ కొవాన్ లను పోలి ఉంటాయి.మరి కొన్ని దావో దే జింగ్ ని తలపిస్తాయి.దావో దే జింగ్, జెన్ కథలు,పద్యాలు, సుఫీ కథలను చదివినప్పుడు మనం పొందే అనుభూతి నే అష్టావక్ర గీత చదివినప్పుడూ కలుగుతుంది.పగలంతా మన ఆఫీసు లో చాకిరీ చేసి , సహోద్యోగులతో మాట్లాడి, పోట్లాడి అలసిన తరువాత జీవిత పరమార్ధం గురింఛి ఆలోచించే సాయం సంధ్య వేళలో మనకు ఈ పుస్తకం చదవడం కొంత స్వాంతన కలిగిస్తుంది.భగవద్గీత లాంటి ఉద్గ్రంతాల లాగా ఇది సంక్లిష్టం గా ఉండదు.మొదటి నించి చివరి వరకూ చాలా సరళమైన వివరణలతో చదువరికి విసుగు,నిద్ర తెప్పించకుండా ఆసక్తిదాయకం గా ఉంటుంది.ఇందులోని విషయాలను మన నిత్య జీవితం లో తరచూ మనల్ని వేధించే ఆలోచనలకు అన్వయించుకుంటే మనో నిబ్బరం కలుగుతుంది.


       దక్షిణ బెంగళూరు లోని బసవనగుడి  రామ కృష్ణ ఆశ్రమం వారు గత నెల లో నిర్వహించి న పుస్తక ప్రదర్శన లో రామకృష్ణ మటం(ఒత్తు ట నా తెలుగు ట్రాన్స్ లితరాషన్ వ్యవస్థలో లేక పోవడం వలన దొర్లిన అచ్చు తప్పును మన్నించ గలరు) వారు ఆంగ్ల టీకా తాత్పర్యం తోప్రచురించిన  అష్టావక్ర గీత పుస్తకం కనిపించడం తో ఎగిరి గంతేసి కొన్నాను.అదే ప్రదర్శనలో కన్నడ అష్టావక్ర గీత కూడా నా మిత్రుడు డా.శివ ప్రసాద్ కొనడం జరిగింది.ఆయన మా కళాశాల లోనే ఎం.బి.ఏ విభాగాధిపతి గా పనిచేస్తున్నారు.

    అష్టావక్ర గీతను రామకృష్ణ పరమహంస తరచు తన శిష్యులను చదవమనే వారని వివేకానందుని జీవిత చరిత్రలో ప్రస్తావించ బడినది.ఈ పుస్తకం వివేకానందుని గూడా ప్రభావితం చేసినట్లు తెలియ వస్తున్నది.అంతే కాకుండా రమణ మహర్షి కూడా ఈ పుస్తకాన్ని తరచూ తన సంభాషణలలో ఉతంకిస్తుందే వారని కూడా తెలిసింది.నేను ఈ సారి తిరుపతి కి వెళ్ళినప్పుడు తెలుగు అష్టావక్ర గీత దొరుకుతుందేమో చూడాలి.
     ఎప్పుడూ పాశ్చాత్య వ్యక్తిత్వ వికాసం పుస్తకాలనే చదవకుండా సంవత్సరం లో ఒకటో రెండో భారత దేశపు ప్రాచీన సాహిత్యాన్నీ చదవడం వలన మన దేశ అధ్యాత్మిక సంస్కృతీ సాహిత్యా ల  పై ఒక అవగాహన , అభిమానం  పెంపొందుతాయి.మన దేశం లో  అతి సరళమైన జన సామాన్యం కూడా అర్థం చేసుకునే విధం గా అష్టా వక్ర గీత లాంటి  మంచి తత్వ శాస్త్ర , వ్యక్తిత్వ వికాస సాహిత్యం ఉన్నదనే విషయం మరుగున పడి  ఉండడం చాలా బాధా కరమైన విషయం.మన దేశం లో ని మేధావులు, వేద-పురాణ పండితులు,అధ్యాత్మిక వాదులు ఇలాంటి ఆధ్యాత్మిక మణి మాణిక్యాలను జన బాహుళ్యానికి చేరువ చేయడానికి కృషి చేస్తే మరుగున పడ్డ ఎన్నో ఉపయోగకరమైన ప్రాచీన పుస్తకాలు మన దేశ యువతకు, చదువరులకు అందుబాటు లో కి వస్తాయి.