బెంగళూరు సంప్రదాయక హోటళ్ళ పై రాస్తున్న రెండవ టపా ఇది.ఇప్పటికే ఈ హోటళ్ల గురించి బెంగళూరు వాసులైన చాలా మంది తెలుగు బ్లాగర్స్ కి తెలిసి ఉండవచ్చు.మిగిలిన వారికి బెంగళూరు లో నేను ముఖ్య మైన అంశం గా భావించే చిన్న హోటల్స్ గురించి నా బ్లాగ్ ద్వారా తెలియబరచాలనే ఉద్దేశ్యంతో ఈ టపాలను ప్రచురిస్తున్నాను.
బ్రాహ్మణుల కాఫీ బార్ గా పిలువబడే ఈ చిన్న హోటల్ దక్షిణ బెంగళూరు వాసులకు కొన్ని దశాబ్దాలు గా సుపరిచితం.ఈ హోటల్ చామరాజ్ పెట్ మరియు గాంధీ బజార్ నుంచి కూత వేటు దూరం లో శంకర పురం లో ఉంది.ఫెబ్రవరి మాసం తొలి ఆదివారం టైమ్స్ అఫ్ ఇండియా పత్రిక లో జి ఎస్ కుమార్ ఈ కాఫీ బార్ గురించి రాసిన డిలైట్ ఫుల్ ఇడ్లి అండ్ దోస ఫేర్ ఫర్ ఎర్లీ బర్డ్స్ అనే ఆర్టికల్ చదివాను.గత ఎనిమిదేళ్ళ నుంచి సాయంకాలం పూట ఇంటికెళ్ళే ముందు అప్పుడప్పుడూ మిత్రులతో కలిసి అక్కడికి వెళ్లడం నాకు అలవాటు. అప్పట్లో ఈ కొట్టు చాలా చిన్న గా ఉండేది గానీ ఎప్పుడూ జనసమ్మర్ధం గా ఉండేది.రెండేళ్ళ క్రితం పునర్నిర్మించారు.అయినా వారి మెనూ లో ఎటువంటి మార్పు లేదు. బ్రాహ్మణుల కాఫీ బార్ లోకాఫీ, టీలతో పాటు ఇడ్లి,దోస,ఉద్దిన వడ మరియు ఖారా బాత్ దొరుకుతాయి.ఇన్నేళ్ళలో రుచి లో నూ నాణ్యత లో ఎలా౦టి తేడా కనిపించట్లేదు.
పై చిత్రం లో మాజీ కేంద్ర మంత్రి, కర్నాటక బి.జే.పి అగ్ర నాయకుడు అనంత్ కుమార్ ఇక్కడ ఆహారాన్ని ఆస్వాదిస్తుండడం చూడవచ్చు.ఈయన లాగే చాలా మంది ప్రముఖులు ఇక్కడికి తరచుగా వస్తూ ఉంటారట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి