కొన్నేళ్ళ క్రితం జేమ్స్ ఫ్రై స్వీయ చరిత్ర "ఏ మిలియన్ లిటిల్ పీసెస్" చదివినప్పుడు అందులో రచయిత జీవితం లో పెను మార్పులు తీసుకొచ్చి అతడి మాదక ద్రవ్యాల వ్యసనాన్ని వదిలివేయ్యడానికి "దావో దే జింగ్ " అనే ప్రాచీన చైనీస్ పుస్తకం సహాయ పడినట్లు చదివాను. తరువాత ఆ పుస్తకం కోసం అంతర్జాలం లో నే కాక బెంగళూరు లో ఉన్న పుస్తకాల దుకానాలన్నిన్తిలో వెతికి చివరకు ఫోరం మాల్ లో ని "ల్యాండ్ మార్క్" దుకాణం లో శంభాల ప్రచురణ సంస్థ వారి tao te ching ను కొన్నాను.కొద్ది రోజుల తరువాత డా.వెన్ దైఎర్ దావో దే జింగ్ పై రాసిన "చెంజ్ యువర్ థాట్స్ , చేంజ్ యువర్ లైఫ్" పుస్తకం కూడా చదివి చాలా ప్రభావితుణ్నయ్యాను.
ఎన్నో వేల ఏళ్ళ ప్రాచీన చరిత్ర గల మన దేశం లో ఇలాంటి పుస్తకాలు లేక పోవడం ఏమిటా అని అప్పట్లో ఆశ్చర్య పడే వాణ్ని.మన భగవద్గీత ఇలాంటి ప్రాచీన వ్యక్తిత్వ వికాస పుస్తకాలలో ఒకటి కావచ్చు కాబోలు అని అప్పటికి సర్ది చెప్పుకున్నాను. ఆర్నెల్ల క్రితం ఒక యాన్ద్రాయిడ్ పలక కొన్నప్పుడు ఈ బుక్స్ కోసం అంతర్జాలం లో వెదుకుతుండగా అష్టావక్ర గీత అనే పుస్తకం తటస్థించచడం జరిగింది. అష్టావక్ర గీత జనకునికి , అష్టావక్ర మహర్షి కీ జరిగిన తాత్విక సంభాషణ.భగవద్గీతలో ని కొన్ని విషయాలను కూడా ఈ పుస్తకంలో అష్టావక్ర మహర్షి జనకునికి చాలా సరళమైన శైలి లో సామాన్య మానవునికి కూడా అర్థమయ్యే విధంగా విడమరిచి చెప్పడం జరిగింది.మరి కొన్ని శ్లోకాలు జెన్ కొవాన్ లను పోలి ఉంటాయి.మరి కొన్ని దావో దే జింగ్ ని తలపిస్తాయి.దావో దే జింగ్, జెన్ కథలు,పద్యాలు, సుఫీ కథలను చదివినప్పుడు మనం పొందే అనుభూతి నే అష్టావక్ర గీత చదివినప్పుడూ కలుగుతుంది.పగలంతా మన ఆఫీసు లో చాకిరీ చేసి , సహోద్యోగులతో మాట్లాడి, పోట్లాడి అలసిన తరువాత జీవిత పరమార్ధం గురింఛి ఆలోచించే సాయం సంధ్య వేళలో మనకు ఈ పుస్తకం చదవడం కొంత స్వాంతన కలిగిస్తుంది.భగవద్గీత లాంటి ఉద్గ్రంతాల లాగా ఇది సంక్లిష్టం గా ఉండదు.మొదటి నించి చివరి వరకూ చాలా సరళమైన వివరణలతో చదువరికి విసుగు,నిద్ర తెప్పించకుండా ఆసక్తిదాయకం గా ఉంటుంది.ఇందులోని విషయాలను మన నిత్య జీవితం లో తరచూ మనల్ని వేధించే ఆలోచనలకు అన్వయించుకుంటే మనో నిబ్బరం కలుగుతుంది.
దక్షిణ బెంగళూరు లోని బసవనగుడి రామ కృష్ణ ఆశ్రమం వారు గత నెల లో నిర్వహించి న పుస్తక ప్రదర్శన లో రామకృష్ణ మటం(ఒత్తు ట నా తెలుగు ట్రాన్స్ లితరాషన్ వ్యవస్థలో లేక పోవడం వలన దొర్లిన అచ్చు తప్పును మన్నించ గలరు) వారు ఆంగ్ల టీకా తాత్పర్యం తోప్రచురించిన అష్టావక్ర గీత పుస్తకం కనిపించడం తో ఎగిరి గంతేసి కొన్నాను.అదే ప్రదర్శనలో కన్నడ అష్టావక్ర గీత కూడా నా మిత్రుడు డా.శివ ప్రసాద్ కొనడం జరిగింది.ఆయన మా కళాశాల లోనే ఎం.బి.ఏ విభాగాధిపతి గా పనిచేస్తున్నారు.
అష్టావక్ర గీతను రామకృష్ణ పరమహంస తరచు తన శిష్యులను చదవమనే వారని వివేకానందుని జీవిత చరిత్రలో ప్రస్తావించ బడినది.ఈ పుస్తకం వివేకానందుని గూడా ప్రభావితం చేసినట్లు తెలియ వస్తున్నది.అంతే కాకుండా రమణ మహర్షి కూడా ఈ పుస్తకాన్ని తరచూ తన సంభాషణలలో ఉతంకిస్తుందే వారని కూడా తెలిసింది.నేను ఈ సారి తిరుపతి కి వెళ్ళినప్పుడు తెలుగు అష్టావక్ర గీత దొరుకుతుందేమో చూడాలి.
ఎప్పుడూ పాశ్చాత్య వ్యక్తిత్వ వికాసం పుస్తకాలనే చదవకుండా సంవత్సరం లో ఒకటో రెండో భారత దేశపు ప్రాచీన సాహిత్యాన్నీ చదవడం వలన మన దేశ అధ్యాత్మిక సంస్కృతీ సాహిత్యా ల పై ఒక అవగాహన , అభిమానం పెంపొందుతాయి.మన దేశం లో అతి సరళమైన జన సామాన్యం కూడా అర్థం చేసుకునే విధం గా అష్టా వక్ర గీత లాంటి మంచి తత్వ శాస్త్ర , వ్యక్తిత్వ వికాస సాహిత్యం ఉన్నదనే విషయం మరుగున పడి ఉండడం చాలా బాధా కరమైన విషయం.మన దేశం లో ని మేధావులు, వేద-పురాణ పండితులు,అధ్యాత్మిక వాదులు ఇలాంటి ఆధ్యాత్మిక మణి మాణిక్యాలను జన బాహుళ్యానికి చేరువ చేయడానికి కృషి చేస్తే మరుగున పడ్డ ఎన్నో ఉపయోగకరమైన ప్రాచీన పుస్తకాలు మన దేశ యువతకు, చదువరులకు అందుబాటు లో కి వస్తాయి.
good show - do write about what you find in it.
రిప్లయితొలగించండినారాయణ స్వామీ గారూ, సూచనకు ధన్యవాదం! మున్ముందు ప్రచురించాబోయే టపాలలో ఒకటి ఇందుకోసం కేటాయిస్తాను.
రిప్లయితొలగించండిమచ్చుకి ఒక శ్లోకాన్ని ఇక్కడ ఉదహరిస్తాను.(జాన్ రిచర్డ్స్ చే ఆంగ్లంలోకి అనువదించబడిన అష్టావక్ర గీత మొదటి అధ్యాయం లోని రెండవ శ్లోకం, పుట ౫)
"అష్టా వక్ర ఉవాచ:
ముక్తిం ఇచ్చసి చేత్తాత్ విషయాన్ విషయత్వజ
క్షమార్జవదయాతోశాసత్యం పియూషవద్ భజ"
"Ashtavakra: If you are seeking liberation, my son, shun the
objects of the senses like poison. Practise tolerance, sincerity,
compassion, contentment and truthfulness like nectar."
తాత్పర్యం:నాయనా!సంసార సాగరం నుంచి విముక్తి పొందాలనుకుంటే త్రికరణ శుద్ధి గా విషయ వాసనలను విషతుల్యం గా తలచి త్యజించుము.అన్ని వేళలా సహనం,సద్భావము,కరుణ, మనఃతృప్తి అనే గుణాలను అలవరచుకొని సత్యవర్తనుడవై మెలగుము.